- ఎన్‌ఆర్‌ఐగా నకిలీ ప్రొఫైల్స్.. వివాహం చేసుకుంటానంటూ నమ్మబలికిన నిందితుడు
- మహిళల బ్యాంకు వివరాలు, క్రెడిట్ కార్డులు, ఓటీపీలతో అక్రమ లావాదేవీలు
- 2021 నుంచి 19 మోసం కేసుల్లో ప్రమేయం ఉన్నట్లు సైబరాబాద్ పోలీసుల వెల్లడి
సామాన్యుడి అస్త్రం / సైబరాబాద్ బ్యూరో : పెళ్లి సంబంధాల పేరుతో అవివాహిత మహిళలను పరిచయం చేసుకొని, భావోద్వేగాలతో నమ్మించి నగదు కాజేస్తున్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న మ్యాట్రిమోనియల్ మోసగాడు మండ వెంకట కామేశ్ అలియాస్ కార్తిక్‌రెడ్డిపై సైబరాబాద్ పోలీసులు పీడీ యాక్ట్ ప్రయోగించారు. సైబరాబాద్ పోలీస్ కమిషనర్ డాక్టర్ ఎం.రమేశ్ ఆదేశాల మేరకు అతడిని ‘సైబర్ క్రైమ్ అఫెండర్’గా పేర్కొంటూ మేడ్చల్ జిల్లా చర్లపల్లి కేంద్ర కారాగారంలో నిర్బంధించారు.
ఆంధ్రప్రదేశ్‌లోని పశ్చిమ గోదావరి జిల్లా ఉండ్రాజవరం మండలం మోర్త గ్రామానికి చెందిన మండ వెంకట కామేశ్ బీటెక్ పూర్తి చేసినట్లు పోలీసులు తెలిపారు. సులభంగా డబ్బు సంపాదించి విలాసవంతమైన జీవితం గడపాలనే ఉద్దేశంతో వివిధ మ్యాట్రిమోనియల్ వెబ్‌సైట్లలో పెళ్లి సంబంధాలు వెతుకుతున్న మహిళలను లక్ష్యంగా చేసుకున్నట్లు పేర్కొన్నారు.
ఎన్‌ఆర్‌ఐనంటూ నకిలీ పరిచయం
‘కార్తిక్‌రెడ్డి’తో పాటు పలు కల్పిత పేర్లతో నకిలీ ప్రొఫైల్స్ సృష్టించిన నిందితుడు.. తాను ఉన్నత విద్యావంతుడినని, సంపన్న కుటుంబానికి చెందిన ఎన్‌ఆర్‌ఐనని, భారీ వేతనంతో ఉద్యోగం చేస్తున్నానని మహిళలను నమ్మించినట్లు పోలీసులు వెల్లడించారు. మ్యాట్రిమోనియల్ యాప్‌ల ద్వారా పరిచయం పెంచుకొని, వాట్సాప్, ఇన్‌స్టాగ్రామ్ వేదికగా భావోద్వేగపూరితంగా మాట్లాడుతూ పెళ్లి చేసుకుంటానని హామీలు ఇచ్చినట్లు వివరించారు.
మహిళల నమ్మకం పొందిన తర్వాత చెల్లెలి చదువు ఖర్చులు, బ్యాంకు సమస్యలు, అత్యవసర ఆర్థిక అవసరాలు, నగదు బదిలీ పరిమితులు వంటి కట్టుకథలు చెప్పి డబ్బులు బదిలీ చేయించుకున్నట్లు ఆరోపించారు. కొందరి నుంచి క్రెడిట్ కార్డు వివరాలు, ఓటీపీలు, బ్యాంకు ఖాతాల సమాచారం తీసుకొని అనధికారిక లావాదేవీలు నిర్వహించడంతోపాటు ఆన్‌లైన్ బెట్టింగ్‌కు నగదును వినియోగించినట్లు పోలీసులు పేర్కొన్నారు.
2021 నుంచి ఇప్పటివరకు నిందితుడికి 19 మోసం కేసులతో సంబంధం ఉన్నట్లు సైబరాబాద్ పోలీసులు వెల్లడించారు. గతంలో సైబర్ క్రైమ్ పోలీసులు అతడిని అరెస్టు చేసి జైలుకు తరలించారని, విడుదలైన తర్వాత మళ్లీ ఇటువంటి నేరాలకు పాల్పడకుండా నిరోధించేందుకు పీడీ యాక్ట్ ప్రయోగించినట్లు తెలిపారు.