- గచ్చిబౌలి ఇందిరానగర్‌లో మహిళా సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌కు చేదు అనుభవం
• పక్కకు లాగి ముద్దు పెట్టినట్లు పోలీసులకు బాధితురాలి ఫిర్యాదు
• సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా నిందితుడిని గుర్తించి అరెస్ట్ చేసిన పోలీసులు
సామాన్యుడి అస్త్రం / గచ్చిబౌలి : గచ్చిబౌలి ఇందిరానగర్‌లో 24 ఏళ్ల మహిళా సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌పై ఓ సెక్యూరిటీ గార్డు అనుచితంగా ప్రవర్తించిన ఘటన కలకలం రేపింది. క్యాబ్ ఎక్కేందుకు వెళ్తున్న యువతిని పక్కకు లాగి బలవంతంగా ముద్దు పెట్టినట్లు బాధితురాలు గచ్చిబౌలి పోలీసులకు ఫిర్యాదు చేసింది.
పోలీసులకు అందిన ఫిర్యాదు వివరాల ప్రకారం.. బాధితురాలు క్యాబ్ ఎక్కుతున్న సమయంలో అక్కడ సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్న రాజ్‌కుమార్ ఆమె వద్దకు వచ్చాడు. ఆమెను పక్కకు లాగి అనుచితంగా ప్రవర్తించినట్లు ఆరోపణ. ఊహించని ఘటనతో షాక్‌కు గురైన యువతి బిగ్గరగా కేకలు వేయడంతో నిందితుడు అక్కడి నుంచి పారిపోయినట్లు సమాచారం.
ఘటన అనంతరం బాధితురాలు గచ్చిబౌలి పోలీసులను ఆశ్రయించింది. ఫిర్యాదు స్వీకరించిన పోలీసులు కేసు నమోదు చేసి పరిసర ప్రాంతాల్లోని సీసీటీవీ కెమెరాల ఫుటేజీని పరిశీలించారు. దాని ఆధారంగా నిందితుడిని జార్ఖండ్‌కు చెందిన రాజ్‌కుమార్‌గా గుర్తించి అదుపులోకి తీసుకుని అరెస్ట్ చేసినట్లు సమాచారం.
మహిళలు పెద్ద సంఖ్యలో పనిచేసే ఐటీ ప్రాంతంలో ఈ ఘటన జరగడం ఆందోళన కలిగిస్తోంది. ముఖ్యంగా కార్యాలయాలు, హాస్టళ్లు, అపార్ట్‌మెంట్లు, గేటెడ్ కమ్యూనిటీల వద్ద విధులు నిర్వహించే ప్రైవేటు సెక్యూరిటీ సిబ్బంది నియామకంలో నేపథ్య పరిశీలన, పర్యవేక్షణ ఎంత పకడ్బందీగా జరుగుతోందన్న ప్రశ్నలు మరోసారి తెరపైకి వస్తున్నాయి.
ఈ ఘటనకు సంబంధించిన పూర్తి పరిస్థితులు, నిందితుడిపై నమోదు చేసిన చట్టపరమైన సెక్షన్లు తదితర అంశాలపై గచ్చిబౌలి పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.