- యువతి మృతి తర్వాత హైదరాబాద్ నుంచి వెళ్లిపోయిన శ్రీనివాస రవితేజ
• ఏపీలోని స్వగ్రామంలో ఆత్మహత్యాయత్నం చేసినట్లు పోలీసులకు సమాచారం
• పరవాడ పోలీసుల సమాచారంతో మాదాపూర్ పోలీసుల దర్యాప్తులో కీలక మలుపు
సామాన్యుడి అస్త్రం / మాదాపూర్ :
మాదాపూర్‌లోని ఓయో హోటల్‌లో యువతి అనుమానాస్పద మృతి కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. కేసులో నిందితుడిగా పేర్కొంటున్న శ్రీనివాస రవితేజ ఏపీలోని తన స్వగ్రామంలో ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు సమాచారం. ప్రస్తుతం అతడిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్లు తెలుస్తోంది.
రవితేజ స్వస్థలం ఆంధ్రప్రదేశ్‌లోని పరవాడ మండలం ఏడుమెట్ల మర్రిపాలెంగా సమాచారం. యువతి మృతి అనంతరం హైదరాబాద్ నుంచి వెళ్లిపోయిన రవితేజ కోసం మాదాపూర్ పోలీసులు ప్రత్యేక బృందాలతో గాలింపు చేపట్టారు. ఈ క్రమంలో అతడు స్వగ్రామానికి చేరుకున్నట్లు తెలుస్తోంది.
పోలీసులకు అందిన సమాచారం ప్రకారం, రవితేజ స్వగ్రామంలోని ఇంట్లోనే ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు తెలుస్తోంది. విషయం గుర్తించిన కుటుంబ సభ్యులు, స్థానికులు అతడిని ఆస్పత్రికి తరలించినట్లు సమాచారం. ఈ పరిణామంపై పరవాడ పోలీసులు మాదాపూర్ పోలీసులకు సమాచారం అందించినట్లు తెలుస్తోంది.
యువతి మృతితో మొదలైన మిస్టరీ
మాదాపూర్ సిద్ధిఖీనగర్ రోడ్ నంబర్–5లోని ఓ హోటల్‌లో షారన్ నిఖిత టోప్నో అనే యువతి శ్రీనివాస రవితేజతో కలిసి బస చేసింది. అనంతరం ఆమె అపస్మారక స్థితిలో ఉండటంతో రవితేజ, హోటల్ సిబ్బంది సహాయంతో కొత్తగూడలోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. అక్కడ వైద్యులు ఆమె అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు.
యువతి ముఖంపై గాయాలు కనిపించడంతో అనుమానాలు తలెత్తాయి. ఘటన అనంతరం రవితేజ ఆస్పత్రి నుంచి వెళ్లిపోవడం, ఫోన్ స్విచ్ఛాఫ్ కావడంతో పోలీసులు అతడి కోసం ప్రత్యేక బృందాలను రంగంలోకి దించారు. హోటల్‌లోని సీసీటీవీ ఫుటేజీ, సాంకేతిక ఆధారాలు, సంబంధిత వ్యక్తుల వాంగ్మూలాలను పరిశీలిస్తూ మాదాపూర్ పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
ఆత్మహత్యాయత్నంతో కేసులో కొత్త మలుపు
యువతి మృతికి ముందు హోటల్ గదిలో అసలు ఏం జరిగింది? ఆమెకు గాయాలు ఎలా అయ్యాయి? ఆస్పత్రికి తీసుకొచ్చిన తర్వాత రవితేజ ఎందుకు వెళ్లిపోయాడు? అనే ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్న సమయంలో తాజా పరిణామం చోటుచేసుకుంది.
రవితేజ కోలుకున్న అనంతరం అతడి వాంగ్మూలం ఈ కేసులో కీలకంగా మారే అవకాశం ఉంది. పరవాడ పోలీసుల నుంచి పూర్తి వివరాలు తీసుకున్న తర్వాత మాదాపూర్ పోలీసులు తదుపరి చర్యలు చేపట్టనున్నట్లు సమాచారం. యువతి మృతికి ఖచ్చితమైన కారణం, ఘటనకు దారితీసిన పరిస్థితులపై పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది.