- రెండు దుకాణాలపై ఈగల్ ఫోర్స్, మాదాపూర్ పోలీసుల సంయుక్త దాడులు
- 92 ఈ-సిగరెట్లు, వేప్‌లు స్వాధీనం.. నలుగురు అదుపులోకి
- సరఫరా వ్యవస్థపై దర్యాప్తు.. పరారీలో ఉన్న యజమాని కోసం గాలింపు
సామాన్యుడి అస్త్రం / మాదాపూర్ : నిషేధిత ఈ-సిగరెట్లు, వేప్‌ల విక్రయాలు మాదాపూర్‌లో బయటపడ్డాయి. రెండు దుకాణాలపై రాష్ట్ర టాస్క్‌ఫోర్స్ ఈగల్ ఫోర్స్, మాదాపూర్ పోలీసులు సంయుక్తంగా నిర్వహించిన దాడుల్లో 92 ఈ-సిగరెట్లు, వేప్‌లు పట్టుబడ్డాయి. ఈ వ్యవహారంలో నలుగురు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. అక్టోబర్ 1న మాదాపూర్‌లోని స్మోకిన్ స్పాట్, కావేరి హిల్స్ ఫేజ్–2లోని హోలీ స్మోక్ దుకాణాల్లో తనిఖీలు నిర్వహించారు. నిషేధిత ఉత్పత్తుల అక్రమ విక్రయాలను గుర్తించి, వాటిని స్వాధీనం చేసుకున్నారు. దాడుల్లో 92 ఈ-సిగరెట్లు, వేప్‌లతోపాటు 15 ప్యాకెట్ల విదేశీ సిగరెట్లు, రెండు స్కానర్లను కూడా స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.
ఈ ఉత్పత్తులు దుకాణాలకు ఎక్కడి నుంచి వస్తున్నాయి? సరఫరా వెనుక ఎవరున్నారు? అనే అంశాలపై పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. విక్రయాలకు సంబంధించిన పూర్తి సరఫరా వ్యవస్థను గుర్తించే పనిలో ఉన్నారు. పరారీలో ఉన్న దుకాణ యజమాని, ఇతర అనుమానితుల కోసం గాలిస్తున్నారు.