Crime

హోటల్‌ గదిలో షారోన్‌ నిఖిత అనుమానాస్పద మృతి.. ప్రియుడు పరార్‌

హోటల్‌ గదిలో షారోన్‌ నిఖిత అనుమానాస్పద మృతి.. ప్రియుడు పరార్‌
  • మాదాపూర్‌ ఓయో హోటల్‌లో అపస్మారక స్థితిలో యువతి
  • ముఖంపై స్వల్ప గాయాలు గుర్తించిన పోలీసులు
  • ఫోన్‌ స్విచ్ఛాఫ్‌ చేసిన రవితేజ కోసం ప్రత్యేక బృందాల గాలింపు
సామాన్యుడి అస్త్రం / మాదాపూర్‌ : మాదాపూర్‌లోని ఓయో హోటల్‌ గదిలో ప్రైవేటు ఉద్యోగిని అనుమానాస్పద స్థితిలో మృతి చెందడం కలకలం రేపింది. మృతురాలిని విశాఖపట్నానికి చెందిన షారోన్‌ నిఖిత టోప్నో (29)గా పోలీసులు గుర్తించారు. ఘటన అనంతరం ఆమె ప్రియుడు శ్రీనివాస రవితేజ ఆసుపత్రి నుంచి వెళ్లిపోయి, తన మొబైల్‌ను స్విచ్ఛాఫ్‌ చేసినట్లు ప్రాథమిక విచారణలో వెల్లడైంది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నిఖిత, రవితేజ ఇద్దరూ సెప్టెంబర్‌ 21న మధ్యాహ్నం 2 గంటల సమయంలో మాదాపూర్‌ సిద్ధిఖీనగర్‌, రోడ్‌ నం.5లోని ఓఎస్‌ఎల్‌ఎన్‌ టెర్మినస్‌, గది నం.304లో దిగారు. అనంతరం నిఖిత హోటల్‌ గదిలో అపస్మారక స్థితిలో కనిపించింది. రవితేజ, ఓయో హోటల్‌ సిబ్బంది సహాయంతో ఆమెను కొత్తగూడలోని అపోలో ఆసుపత్రికి తరలించగా, అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.

నిఖిత ముఖంపై స్వల్ప గాయాలు ఉన్నట్లు గుర్తించడంతో ఆమె మృతిపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సమాచారం అందుకున్న క్లూస్‌ టీమ్‌ హోటల్‌ గదిని పరిశీలించింది. ఆధారాల సేకరణ కోసం గదితోపాటు ఘటనాస్థలాన్ని పోలీసులు భద్రపరిచారు.

నిఖితను ఆసుపత్రికి తీసుకొచ్చిన రవితేజ ఆ తర్వాత అక్కడి నుంచి వెళ్లిపోయినట్లు పోలీసులు తెలిపారు. అనంతరం అతడు తన మొబైల్‌ ఫోన్‌ను స్విచ్ఛాఫ్‌ చేయడంతో అతడి ఆచూకీ కోసం ప్రత్యేక బృందాలను రంగంలోకి దించారు. పోస్టుమార్టం నివేదిక, ఫోరెన్సిక్‌ ఆధారాలు, రవితేజ విచారణ అనంతరమే నిఖిత మృతికి గల కచ్చితమైన కారణం వెల్లడయ్యే అవకాశం ఉంది. ఘటనపై తదుపరి దర్యాప్తు కొనసాగుతోంది.

Related News సంబంధిత వార్తలు

Advertisement 728 x 90 Banner Placehoder