Telangana

రేగుల కుంట శిఖంలో ఐదంతస్తులు.. క్రిమినల్‌ కేసులకు తహసీల్దార్‌ లేఖ!

రేగుల కుంట శిఖంలో ఐదంతస్తులు.. క్రిమినల్‌ కేసులకు తహసీల్దార్‌ లేఖ!
  • సర్వే నంబర్‌ 150 పత్రాలతో 151లో నిర్మాణం
  • 372.5 గజాల ప్రభుత్వ భూమి ఆక్రమణగా సర్వేలో నిర్ధారణ
  • బిల్డర్‌, నిర్మాణ సంస్థ, సొసైటీ ప్రతినిధులు, విక్రేతలపై కేసుకు విజ్ఞప్తి
సామాన్యుడి అస్త్రం / శేరిలింగంపల్లి : హఫీజ్‌పేట రేగుల కుంట శిఖం ప్రభుత్వ భూమిలో ఐదంతస్తుల భవనాన్ని నిర్మించిన వ్యవహారం క్రిమినల్‌ కేసుల దిశగా మలుపు తిరిగింది. ఆక్రమణకు బాధ్యులుగా పేర్కొన్న బిల్డర్‌, నిర్మాణ సంస్థ ప్రతినిధి, హౌసింగ్‌ సొసైటీ కార్యదర్శి, స్థల విక్రేతలపై తగిన సెక్షన్ల కింద కేసు నమోదు చేయాలని శేరిలింగంపల్లి డిప్యూటీ కలెక్టర్‌, తహసీల్దార్‌ కె.మహిపాల్‌రెడ్డి మియాపూర్‌ పోలీసులను కోరారు. ఈ మేరకు సెప్టెంబర్‌ 26న ఎల్‌ఆర్‌.నంబర్‌ బి/1140/2025తో లేఖ రాశారు.
రెవెన్యూ రికార్డుల ప్రకారం హఫీజ్‌పేట సర్వే నంబర్‌ 151లోని మొత్తం 17.14 ఎకరాలు రేగుల కుంట శిఖం సర్కారీ’గా నమోదై ఉన్నాయని అధికారులు పేర్కొన్నారు. ఇందులో 372.5 చదరపు గజాల్లో శ్రీరామ కన్‌స్ట్రక్షన్స్‌ ఐదంతస్తుల భవనం నిర్మించినట్లు మండల సర్వేయర్‌, గిర్దావర్‌ సంయుక్త పరిశీలనలో తేలింది. పక్కనే ఉన్న పట్టా భూమి సర్వే నంబర్‌ 150కు సంబంధించిన రిజిస్ట్రేషన్‌ పత్రాలు, భవన నిర్మాణ అనుమతులను చూపిస్తూ.. వాస్తవంగా సర్వే నంబర్‌ 151లో నిర్మాణం చేపట్టినట్లు లేఖలో స్పష్టం చేశారు.
హైకోర్టు ఆదేశాల మేరకు నిర్వహించిన సర్వేలో భవనం ప్రభుత్వ శిఖం భూమిలోనే ఉన్నట్లు నిర్ధారణ కావడంతో భూ ఆక్రమణ చట్టం-1905 కింద చర్యలు ప్రారంభించారు. సెప్టెంబర్‌ 5న తాజా నోటీసు జారీ చేయగా, నిర్మాణ సంస్థ 7న వివరణ ఇచ్చింది. దాన్ని పరిశీలించిన అధికారులు 23న ఖాళీ చేయింపు ఉత్తర్వులు జారీ చేశారు. అయినప్పటికీ నిర్మాణ పనులు కొనసాగించినట్లు తహసీల్దార్‌ తెలిపారు.
బిల్డర్‌ ఎన్‌.పవన్‌కుమార్‌, శ్రీరామ కన్‌స్ట్రక్షన్స్‌ మేనేజింగ్‌ పార్ట్‌నర్‌ వి.శ్రీనివాసరావు, దీప్తిశ్రీ కోఆపరేటివ్‌ హౌస్‌ బిల్డింగ్‌ సొసైటీ కార్యదర్శి కేవీఆర్‌ఐ శర్మతోపాటు పత్రాల్లో పేర్కొన్న విక్రేతలపై క్రిమినల్‌ కేసు నమోదు చేసి, ఎఫ్‌ఐఆర్‌ ప్రతిని తమ కార్యాలయానికి పంపాలని మియాపూర్‌ పోలీసులను కోరారు.

Related News సంబంధిత వార్తలు

Advertisement 728 x 90 Banner Placehoder