- వివేకానందనగర్‌లో ఘనంగా ముగిసిన గణేశ్ నవరాత్రి ఉత్సవాలు
- ఉట్టి కార్యక్రమంలో చిన్నారుల కేరింతలు.. ఆటపాటలతో మహిళల సందడి
- అన్నదానం అనంతరం గణనాథుడికి భక్తిశ్రద్ధలతో వీడ్కోలు
సామాన్యుడి అస్త్రం / మాదాపూర్ : గణపతి బప్పా మోరియా నినాదాలు.. చిన్నారుల కేరింతలు.. మహిళల ఆటపాటల మధ్య వివేకానందనగర్ భక్తిసంద్రంగా మారింది. గాయత్రినగర్ డివిజన్–254 పరిధిలో శ్రీ సాయి గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన గణేశ్ నవరాత్రి ఉత్సవాలు ఘనంగా ముగిశాయి. 11 రోజులపాటు ప్రత్యేక పూజలు అందుకున్న గణనాథుడికి కాలనీవాసులు భక్తిశ్రద్ధలతో వీడ్కోలు పలికారు.
నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ప్రతిరోజూ ప్రత్యేక పూజలు, భజనలు నిర్వహించారు. కాలనీవాసులు కుటుంబ సమేతంగా పాల్గొని స్వామివారికి పూజలు చేశారు. చివరి రోజు ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. చిన్నారులు, మహిళలు ఆటపాటలతో సందడి చేయడంతో ఉత్సవ ప్రాంగణంలో కోలాహలం నెలకొంది.
సంప్రదాయబద్ధంగా నిర్వహించిన ఉట్టి కొట్టే కార్యక్రమం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఉట్టి కొట్టేందుకు చిన్నారులు పోటీపడగా.. వారి ఉత్సాహం, కేరింతలు కాలనీవాసులను అలరించాయి. మహిళలు సైతం వివిధ కార్యక్రమాల్లో పాల్గొని పండుగ వాతావరణాన్ని మరింత ఉత్సాహంగా మార్చారు.
ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో భక్తులకు అన్నదానం నిర్వహించారు. పెద్ద సంఖ్యలో కాలనీవాసులు పాల్గొని ప్రసాదాన్ని స్వీకరించారు. అనంతరం గణపతి బప్పా మోరియా నినాదాల మధ్య గణనాథుడిని నిమజ్జనానికి తరలించారు. భక్తిగీతాలు, నృత్యాలు, జైజై నినాదాలతో సాగిన వేడుకలో చిన్నాపెద్దా ఉత్సాహంగా పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో శ్రీ సాయి గణేష్ ఉత్సవ కమిటీ అధ్యక్షుడు అంజయ్య, మురళి, ముని, హరి, బాలరాజు, రమణ, నాయుడు, రాజు, అనిల్, కమిటీ సభ్యులు, మహిళలు, చిన్నారులు, కాలనీవాసులు పాల్గొన్నారు.