- 2020లోనే DGPS సర్వేలో రేగులకుంట ఆక్రమణ గుర్తింపు
- 372.5 గజాలకు స్టిల్ట్+5 అంతస్తుల అనుమతి.. సైట్‌ను పరిశీలించిందెవరు?
సామాన్యుడి అస్త్రం / శేరిలింగంపల్లి :
హఫీజ్‌పేట రేగులకుంట ప్రభుత్వ శిఖం భూమిలో నిర్మాణం వ్యవహారం ఇప్పుడు కేవలం ఆక్రమణకే పరిమితం కావడం లేదు. ప్రభుత్వ భూమి గ్రౌండ్ లొకేషన్‌ను పక్కనున్న పట్టా సర్వే నంబరుగా చూపి రిజిస్టర్డ్ పత్రాలు చేశారని రెవెన్యూ శాఖే పేర్కొంటున్న వేళ.. అదే స్థలానికి ఐదంతస్తుల భవన నిర్మాణ అనుమతి ఎలా వచ్చింది? అన్న ప్రశ్న ఇప్పుడు కీలకంగా మారింది.
2020 సెప్టెంబర్‌లో డిప్యూటీ ఇన్‌స్పెక్టర్ ఆఫ్ సర్వే, మండల సర్వేయర్‌తో కలిసి DGPS ద్వారా పరిశీలించి, హఫీజ్‌పేట సర్వే నంబర్ 150లోని ప్లాట్ల యజమానుల ఆక్రమణ సర్వే నంబర్ 151 రేగులకుంటలో సుమారు 1,202 గజాల మేర ఉన్నట్లు నివేదికలో పేర్కొన్నారు. మరోవైపు వివాదాస్పద నిర్మాణానికి సంబంధించిన పత్రాల్లో ప్లాట్ నంబర్లు 513/2, 513/3, 516లోని భాగాలను కలిపి 372.5 గజాలను సర్వే నంబర్ 150లో ఉన్నట్లు చూపించారు. ఇదే స్థలానికి స్టిల్ట్+5 అంతస్తుల నిర్మాణానికి అనుమతి మంజూరైనట్లు అందుబాటులో ఉన్న పర్మిషన్ పత్రాలు సూచిస్తున్నాయి.
ఈ వ్యవహారంలో 2026 సెప్టెంబర్ 26న శేరిలింగంపల్లి డిప్యూటీ కలెక్టర్, తహసీల్దార్ మియాపూర్ పోలీసులకు రాసిన లేఖ మరింత కీలకంగా మారింది. సర్వే నంబర్ 151లోని ప్రభుత్వ భూమి గ్రౌండ్ లొకేషన్‌ను పక్కనున్న పట్టా భూమి సర్వే నంబర్ 150గా చూపుతూ రిజిస్టర్డ్ పత్రాల ద్వారా హక్కులు బదిలీ చేశారని పేర్కొంటూ డెవలప్‌మెంట్ అగ్రిమెంట్ హోల్డర్‌తో పాటు మొదటి, తదుపరి విక్రయదారులపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని కోరారు.
అంతకుముందు ఫిబ్రవరి 11న HMDA కూడా సర్వే నంబర్ 151 రేగులకుంట ప్రభుత్వ చెరువు భూమిలో అక్రమ నిర్మాణంపై అందిన ఫిర్యాదును GHMC కమిషనర్‌కు పంపి పరిశీలించి అవసరమైన చర్యలు తీసుకోవాలని కోరింది. అనంతరం రెవెన్యూ శాఖ Land Encroachment Act కింద వరుసగా నోటీసులు, సర్వేలు, ఉత్తర్వుల ప్రక్రియ చేపట్టి, సంబంధిత భవన అనుమతిని రద్దు చేయాలని మున్సిపల్ యంత్రాంగాన్ని కోరినట్లు అందుబాటులో ఉన్న పత్రాలు వెల్లడిస్తున్నాయి.
‘ప్రైవేటు వ్యక్తులపైనే చర్యలా.. అధికారుల పాత్రేది?’
ఈ వ్యవహారంపై ‘జనం కోసం’ అధ్యక్షుడు కాసిరెడ్డి భాస్కర్‌రెడ్డి పలు ప్రశ్నలు లేవనెత్తారు. 2020లోనే ప్రభుత్వ సర్వే విభాగం DGPSతో ఆక్రమణను గుర్తిస్తే, 2023లో భవన అనుమతి ఇచ్చే సమయంలో ఆ రికార్డులను ఎందుకు పరిశీలించలేదని ప్రశ్నించారు. 372.5 గజాల స్థలం నిజంగా సర్వే నంబర్ 150లోనే ఉందా? హద్దులు, గ్రౌండ్ లొకేషన్, అప్రోచ్ రోడ్డును ఎవరు నిర్ధారించారు? సైట్ ఇన్‌స్పెక్షన్ జరిగిందా? జరిగితే అధికారుల నివేదిక ఏమిటి? అని ప్రశ్నించారు.
ప్రైవేటు వ్యక్తులపై క్రిమినల్ చర్యలు కోరుతున్న అధికారులు, అదే స్థలానికి అనుమతి చేరిన ప్రక్రియలో అధికారుల పాత్రను కూడా విచారించాలని, పూర్తి పర్మిషన్ ఫైల్‌తో పాటు సైట్ ఇన్‌స్పెక్షన్ నివేదికను బయటపెట్టి బాధ్యత ఎవరిదో తేల్చాలని భాస్కర్‌రెడ్డి డిమాండ్ చేశారు.