Lifestyle

కుప్పల తెప్పలగా నోటీసులు జారీ.. మరి చర్యలలో మౌనమెందుకు

కుప్పల తెప్పలగా నోటీసులు జారీ.. మరి చర్యలలో మౌనమెందుకు

శేరిలింగంపల్లి ఎంఈఓ కార్యాలయంలో ఏమి జరుగుతుంది 

* ఫిర్యాదు చేసిన విద్యార్థి సంఘాల చేతికే స్కూళ్ల నోటీసులు ఇస్తున్నారంటూ ఆరోపణ
* నోటీసులు సరే.. వాటిపై తీసుకున్న చర్యల వివరాలేవంటున్న విద్యార్థి సంఘం
* అస్త్రం డైలీ ప్రశ్నలకు ఎంఈఓ సమాధానాలతో మరిన్ని సందేహాలు

సామాన్యుడి అస్త్రం / శేరిలింగంపల్లి : పాఠశాలల్లో నిబంధనల ఉల్లంఘనలపై ఫిర్యాదు వస్తే పరిశీలించాలి లోపాలు ఉంటే నోటీసు ఇవ్వాలి యాజమాన్యం నుంచి వివరణ తీసుకోవాలి ఉల్లంఘనలు నిర్ధారణ అయితే చర్యలు చేపట్టాలి. ఇదంతా అధికారిక రికార్డుల్లో నమోదవ్వాలి. కానీ శేరిలింగంపల్లి మండల విద్యాశాఖ అధికారి కార్యాలయం నుంచి జారీ అవుతున్న నోటీసుల విషయంలో పరిస్థితి ఇందుకు భిన్నంగా ఉందంటూ విద్యార్థి సంఘాల నుంచి తీవ్ర ఆరోపణలు వినిపిస్తున్నాయి. గత మూడు నెలల్లో సుమారు 65 నోటీసులు జారీ చేసినట్లు చెబుతున్నప్పటికీ, వాటిలో ఎన్ని పాఠశాలలపై తదుపరి చర్యలు తీసుకున్నారన్నది స్పష్టంగా తెలియడం లేదని దళిత బహుజన స్టూడెంట్ ఫెడరేషన్ అధ్యక్షుడు కిరణ్ కుమార్ ఆరోపిస్తున్నారు.

కొన్ని ప్రైవేటు పాఠశాలల్లో అనుమతులు, నిబంధనల ఉల్లంఘనలపై తమ సంఘం ఎంఈఓ కార్యాలయానికి ఫిర్యాదులు చేసిందని, వాటి ఆధారంగా నోటీసులు సిద్ధం చేసిన అధికారులు సంబంధిత పాఠశాలలకు అధికారిక సిబ్బంది ద్వారా వాటిని పంపకుండా ఫిర్యాదు చేసిన వారి చేతికే నోటీసులు ఇచ్చి స్కూల్‌కు అందించాలని చెప్పారని విద్యార్థి సంఘం చెబుతుంది. ఒక పాఠశాలపై ఫిర్యాదు చేసిన వ్యక్తే అదే పాఠశాలకు నోటీసు తీసుకెళ్లాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చిందని ఆయన ప్రశ్నించగా, అవును కానీ ఎదో ఒకసారి జరిగినా దానికోసం ఇప్పుడెందుకు అంటూ సమాధానమిచ్చిన ఎం ఈ ఓ. నోటీసు ఎప్పుడు జారీ అయింది? ఎవరి ద్వారా పంపారు? ఎవరు స్వీకరించారు? అక్నౌలెడ్జమెంట్ తీసుకున్నారా? అవుట్ వార్డు రిజిస్టర్ లో నమోదు చేశారా? అనే వివరాలు బయటపెడితే అసలు విషయం తేలిపోతుందని అంటున్నారు.

అయిపోయాయి.. ఇప్పుడు ఏం చేద్దాం?

ఇదే అంశంపై సామాన్యుడి అస్త్రం రిపోర్టర్ ఎంఈఓను ఫిర్యాదు చేసిన వ్యక్తుల చేతికే సంబంధిత స్కూల్ నోటీసులు ఇచ్చి పంపించడం ఎలా అని అడిగగా. దీనికి పూర్తి వివరణ ఇవ్వాల్సిన ఎంఈఓ, అవన్నీ అయిపోయాయి.. అయితే ఇప్పుడు ఏం చేద్దాం? అని స్పందించినట్లు రిపోర్టర్ తెలియజేశారు. జరిగిన విషయం అయిపోయిందని చెప్పడంతో అధికారిక ప్రక్రియపై వచ్చిన సందేహాలకు సమాధానం దొరికినట్లు కాదని విద్యార్థి సంఘం అంటోంది. ప్రభుత్వ కార్యాలయం నుంచి బయటకు వెళ్లే ప్రతి నోటీసుకు ఒక లెక్క, దాని తర్వాత జరిగిన చర్యకు మరో లెక్క ఉండాల్సిందేనని చెబుతోంది.

ఇదే సమయంలో మరో ప్రైవేటు పాఠశాలపై ఇచ్చిన ఫిర్యాదు విషయంలో ఏం చర్య తీసుకున్నారని అస్త్రండైలీ రిపోర్టర్ ప్రశ్నించగా, ఆ స్కూల్‌కు అన్ని పర్మిషన్లు ఉన్నాయి అని ఎంఈఓ సమాధానం ఇచ్చినట్లు తెలిపారు. దీంతో అన్ని అనుమతులు ఉన్నాయని చెబుతున్న పాఠశాలకు మరి నోటీసు ఎందుకు ఇచ్చారు? అని తిరిగి ప్రశ్నించగా అదేమీ లేదే అని నీల్లునములుతున్నారు. ఒకవైపు ఫిర్యాదు ఆధారంగా నోటీసు మరోవైపు అన్ని అనుమతులు ఉన్నాయన్న సమాధానం ఈ రెండింటిలో అధికారిక రికార్డులు ఏం చెబుతున్నాయన్నదే ఇప్పుడు కీలకంగా మారింది. 

65 నోటీసులు.. యాక్షన్ ఎక్కడ?

మూడు నెలల్లో సుమారు 65 నోటీసులు జారీ అయ్యాయన్న అంశమే ఇప్పుడు ఈ వ్యవహారంలో కీలకంగా మారుతోంది. నోటీసులు ఇవ్వడం మాత్రమే అధికారుల బాధ్యతను పూర్తి చేయదు. ఆయా పాఠశాలలు ఇచ్చిన వివరణ ఏమిటి? అధికారులు క్షేత్రస్థాయిలో తనిఖీ చేశారా? ఉల్లంఘనలు గుర్తించారా? గుర్తిస్తే ఏ చర్య తీసుకున్నారు? అనుమతులు సక్రమంగా ఉంటే కేసును ఏ ప్రాతిపదికన ముగించారు? అనే వివరాలు కూడా ఉండాలి. 65 నోటీసులకు సంబంధించిన యాక్షన్ టేకెన్ రిపోర్ట్ బయటపెడితే ప్రస్తుతం వస్తున్న అనేక ఆరోపణలకు సమాధానం దొరుకుతుందని విద్యార్థి సంఘం పేర్కొంటోంది.

ఇక పాఠశాలలకు ఇచ్చే నోటీసుల పేరుతో డబ్బుల వసూళ్లు జరుగుతున్నాయంటూ కిరణ్ కుమార్ తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. అయినప్పటికీ నోటీసుల జారీ, వాటి పంపిణీ, తదుపరి చర్యలకు సంబంధించిన పూర్తి రికార్డులపై ఉన్నతాధికారులు విచారణ జరిపితే ఆరోపణల్లో నిజానిజాలు బయటపడతాయని కిరణ్ కుమార్ కోరుతున్నారు.

ఔట్ వార్డ్ రిజిస్టర్ అడిగితే.. మీకు అవసరం లేదు?

మూడు నెలల్లో ఇన్ని నోటీసులు జారీ అయితే వాటికి సంబంధించిన ఔట్వార్డ్ రిజిస్టర్ నిర్వహిస్తున్నారా అని విద్యార్థి సంఘనాయకులు ఎంఈఓను ప్రశ్నించినట్లు తెలిపారు. దీనికి రికార్డుల వివరాలను చెప్పకుండా అవన్నీ మీకు అవసరం లేదు అని ఎంఈఓ అన్నారు. ప్రభుత్వ కార్యాలయం నుంచి వెళ్లే అధికారిక నోటీసుల విషయంలో వాటి జారీ తేదీ, సంబంధిత పాఠశాల, పంపిన విధానం, స్వీకరించిన వివరాలు, అనంతరం తీసుకున్న చర్య వంటి అంశాలు రికార్డుల్లో ఉంటే ఆ నోటీస్లు చట్టబద్దంగా వెళ్ళినట్టు పరిగణిచాలి కానీ కేవలం ధనార్జనే లాభంగా చూస్తున్న ఏం ఈ ఓ ఎన్ని నోటీస్ లను ఆన్ రెకోర్దే పంపరో వాటిని పరిశీలించడం ద్వారా ఈ వివాదానికి స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

ఇక్కడ ప్రశ్న వ్యక్తుల గురించి మాత్రమే కాదు.. వ్యవస్థ ఎలా పనిచేస్తోందన్నదే అసలు అంశం. మూడు నెలల్లో సుమారు 65 నోటీసులు నిజంగానే జారీ అయితే వాటిలో ఎన్ని పాఠశాలలపై చర్యలు తీసుకున్నారు? ఫిర్యాదు చేసిన వారి చేతికే నోటీసులు ఇచ్చిన సందర్భాలు ఎన్ని? అన్ని అనుమతులు ఉన్నాయని చెబుతున్న పాఠశాలకు నోటీసు ఎందుకు వెళ్లింది? నోటీసుల తర్వాత యాక్షన్ టేకెన్ రిపోర్ట్స్ ఎక్కడ? అనే విద్యార్థి సంఘాలు అడుగుతున్న ప్రశ్నలకు సంబంధిత రికార్డులతో విద్యాశాఖ ఉన్నతాధికారులు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది.

ఇది ఆరంభం మాత్రమే. శేరిలింగంపల్లి విద్యాశాఖలో పాఠశాలలకు జారీ చేసిన నోటీసులు, వాటి వెనుక ఉన్న ఫిర్యాదులు, అనుమతుల పరిస్థితి, అనంతరం తీసుకున్న చర్యలను ఒక్కో ఆధారంతో మన తెలంగాణలో ప్రత్యేక కథనాల ద్వారా పాఠకుల ముందుకు తీసుకురానుంది.

Related News సంబంధిత వార్తలు

Advertisement 728 x 90 Banner Placehoder