- సత్యం–అహింస ఆశయాలు నేటికీ ఆదర్శమే: సైబరాబాద్ సీపీ డా. ఎం. రమేష్
- సైబరాబాద్ కమిషనరేట్‌లో ఘనంగా మహాత్మా గాంధీ జయంతి వేడుకలు
- శాంతి, సామరస్యం, సోదరభావాన్ని పెంపొందించాలని సీపీ పిలుపు
- ప్రజలకు న్యాయం.. బాధ్యతతో విధుల నిర్వహణే పోలీసుల ప్రధాన కర్తవ్యమని స్పష్టం
సామాన్యుడి అస్త్రం / సైబరాబాద్ బ్యూరో :
జాతిపిత మహాత్మా గాంధీ ప్రపంచానికి చూపిన సత్యం, అహింస, శాంతి మార్గాలు నేటికీ ప్రతి ఒక్కరికీ ఆదర్శప్రాయమని సైబరాబాద్ పోలీస్ కమిషనర్ డా. ఎం. రమేష్ పేర్కొన్నారు. గాంధీ జయంతిని పురస్కరించుకుని శుక్రవారం సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్‌లో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన గాంధీజీ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.
ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ.. భారత స్వాతంత్ర్య పోరాటంలో మహాత్మా గాంధీ పోషించిన పాత్ర, దేశం కోసం ఆయన చేసిన త్యాగాలు చిరస్మరణీయమన్నారు. ఆయుధం లేకుండానే సత్యం, అహింసను అస్త్రాలుగా చేసుకుని దేశ ప్రజలను ఏకతాటిపైకి తీసుకొచ్చిన గాంధీజీ జీవితం తరతరాలకు స్ఫూర్తిగా నిలుస్తుందని పేర్కొన్నారు. ఆయన చూపిన శాంతి, క్రమశిక్షణ మార్గాలను ప్రతి ఒక్కరూ తమ జీవితంలో ఆచరించాల్సిన అవసరం ఉందన్నారు.
సమాజంలో శాంతి, సామరస్యం, సోదరభావం పెంపొందించేందుకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని సీపీ పిలుపునిచ్చారు. ముఖ్యంగా పోలీసు వ్యవస్థలో పనిచేసే ప్రతి ఒక్కరూ ప్రజలకు న్యాయం అందించడాన్ని ప్రధాన బాధ్యతగా భావించాలని సూచించారు. విధి నిర్వహణలో క్రమశిక్షణ, బాధ్యత, అంకితభావంతో పనిచేస్తూ ప్రజలకు మరింత చేరువ కావాలని చెప్పారు.
గాంధీజీ కలలుగన్న స్వచ్ఛమైన, శాంతియుతమైన, సమానత్వ సమాజం కేవలం మాటలతో సాధ్యం కాదని, ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతను నిర్వర్తించినప్పుడే ఆ లక్ష్యం సాకారమవుతుందని పేర్కొన్నారు. గాంధీ జయంతి సందర్భంగా ఆయన ఆశయాలను స్మరించుకోవడంతో పాటు వాటిని ఆచరణలో పెట్టడమే ఆయనకు ఇచ్చే నిజమైన నివాళి అవుతుందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో అడ్మిన్ డీసీపీ అన్నపూర్ణ, హెడ్‌క్వార్టర్స్ డీసీపీ సంజీవ్, హెడ్‌క్వార్టర్స్ అడిషనల్ డీసీపీ షమీర్, హన్మంత్ రావుతో పాటు పలువురు పోలీసు ఉన్నతాధికారులు పాల్గొని మహాత్మా గాంధీకి నివాళులర్పించారు.