Technology

సీజ్‌తో సరి కాదు.. ‘సంస్కృతి’ లెక్క తేల్చాల్సిందే!

సీజ్‌తో సరి కాదు.. ‘సంస్కృతి’ లెక్క తేల్చాల్సిందే!
  • విద్యార్థి నాయకుల వరుస ఫిర్యాదులతో ఇంటర్నేషనల్ స్కూల్‌కు తాళం
  • అనుమతుల నుంచి ఫీజుల వరకు సమగ్ర విచారణకు డిమాండ్త
  • తప్పిదాలు తేలితే యాజమాన్యంపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలంటున్న విద్యార్థి సంఘాలు
సామాన్యుడి అస్త్రం / కొండాపూర్ : కొండాపూర్‌లోని సంస్కృతి ఇంటర్నేషనల్ స్కూల్ వ్యవహారంలో ఎట్టకేలకు విద్యాశాఖ చర్యలకు దిగింది. గోల్డెన్ తులిప్ ప్రాంతంలో కొనసాగుతున్న ఈ పాఠశాల నిర్వహణ, అనుమతులు, నిబంధనలపై విద్యార్థి సంఘాల నాయకులు వరుసగా చేసిన ఫిర్యాదుల నేపథ్యంలో డిఈఓ ఆదేశాల మేరకు శేరిలింగంపల్లి మండల ఎంఈ ఓ వెంకటయ్య ఆధ్వర్యంలో విద్యాశాఖ అధికారులు పాఠశాలను మూసివేసి సీజ్ చేశారు.

అయితే స్కూల్‌కు తాళం వేయడంతోనే కథ ముగిసిపోకూడదని, అసలు ఈ పాఠశాల ఇన్నాళ్లు ఏ అనుమతులతో కొనసాగింది? సంబంధిత శాఖల నుంచి అవసరమైన అనుమతులన్నీ ఉన్నాయా? నిబంధనలకు అనుగుణంగానే కార్యకలాపాలు సాగాయా? అనే అంశాలను సమగ్రంగా విచారించాలని విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.

1500 మంది విద్యార్థులు.. 4000 గజాల్లో స్కూల్!

విద్యార్థి నాయకులు వెల్లడించిన వివరాల ప్రకారం సుమారు 4,000 గజాల స్థలంలో, దాదాపు 1,500 మంది విద్యార్థులతో పాఠశాల కొనసాగుతోంది. ఇంత పెద్ద సంఖ్యలో విద్యార్థుల భవిష్యత్తుతో ముడిపడిన సంస్థ విషయంలో కేవలం సీజ్‌తో సరిపెట్టకుండా, పాఠశాల నిర్వహణకు అవసరమైన అనుమతులన్నింటినీ శాఖల వారీగా పరిశీలించాలని వారు కోరుతున్నారు.

ప్రధానంగా విద్యాశాఖ గుర్తింపు, భవన వినియోగానికి సంబంధించిన అనుమతులు, విద్యార్థుల భద్రతకు అవసరమైన ప్రమాణాలు సహా వర్తించే అన్ని నిబంధనలను పరిశీలించి ఏ అనుమతి ఉంది? ఏది లేదు? ఎక్కడ నిబంధనల ఉల్లంఘన జరిగింది? అనే వివరాలను అధికారులు బహిర్గతం చేయాలని డిమాండ్ చేస్తున్నారు.

ఫీజుల లెక్క కూడా తేల్చండి

పాఠశాలలో చదువుతున్న విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి ఇప్పటివరకు ఎంత ఫీజు వసూలు చేశారు? ఏయే పేర్లతో వసూళ్లు జరిగాయి? వాటికి సంబంధించిన రికార్డులు సక్రమంగా ఉన్నాయా? అనే అంశాలను కూడా విచారణ పరిధిలోకి తీసుకురావాలని విద్యార్థి నాయకులు కోరుతున్నారు.

పాఠశాల సీజ్ నేపథ్యంలో ప్రస్తుతం చదువుతున్న విద్యార్థుల విద్యకు అంతరాయం కలగకుండా విద్యాశాఖ ప్రత్యేక చర్యలు తీసుకోవాలని, తల్లిదండ్రులకు స్పష్టమైన సమాచారం అందించాలని సూచిస్తున్నారు. యాజమాన్యంపై చర్యలు తీసుకునే క్రమంలో విద్యార్థుల భవిష్యత్తు నష్టపోకుండా చూడాల్సిన బాధ్యత అధికారులపైనే ఉందని పేర్కొంటున్నారు.

తప్పిదాలు తేలితే కేసులు పెట్టాలి

విచారణలో నిబంధనల ఉల్లంఘనలు లేదా ఇతర చట్టవిరుద్ధ అంశాలు నిర్ధారణ అయితే బాధ్యులపై శాఖాపరమైన చర్యలతో సరిపెట్టకుండా, వర్తించే చట్టాల ప్రకారం చట్టపరమైన, అవసరమైతే క్రిమినల్ చర్యలు తీసుకోవాలని విద్యార్థి సంఘాల నాయకులు డిమాండ్ చేశారు.

అదే సమయంలో స్కూల్‌ను సీజ్ చేయడానికి దారితీసిన అధికారిక కారణాలు, తనిఖీల్లో గుర్తించిన అంశాలు, యాజమాన్యానికి గతంలో ఇచ్చిన నోటీసులు, వాటికి యాజమాన్యం ఇచ్చిన సమాధానాలు తదితర వివరాలను విద్యాశాఖ వెల్లడిస్తేనే మొత్తం వ్యవహారంపై స్పష్టత వస్తుందని అంటున్నారు.

‘తాళం వేశారు.. ఇక వదిలేయం’

సంస్కృతి ఇంటర్నేషనల్ స్కూల్‌పై చర్యలు తీసుకోవాలంటూ తాము కొంతకాలంగా విద్యాశాఖ అధికారులకు ఫిర్యాదులు చేస్తున్నామని విద్యార్థి నాయకులు పేర్కొన్నారు. స్కూల్ సీజ్ కావడం తమ పోరాటంలో ఒక దశ మాత్రమేనని, పూర్తి విచారణ జరిపి తుది చర్యలు ప్రకటించే వరకు పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు.

ఈ పోరాటంలో బైరు నాగరాజు గౌడ్ – నవ తెలంగాణ స్టూడెంట్ యూనియన్, ఓయూ శంకర్ – టీవీవ్ /ఓయూ జేఏసీ, రణధీర్ రెడ్డి, బబ్లు గౌడ్ (జస్వంత్) బీసీ సంఘం, బొప్పని ఈశ్వర్ బహుజన సంఘ్, గణేష్ ఓయూ జేఏసీ తదితరులు పాల్గొని విద్యాశాఖకు ఫిర్యాదులు చేసినట్లు తెలిపారు.

Related News సంబంధిత వార్తలు

Advertisement 728 x 90 Banner Placehoder